కలసి వుంటే కలదు సుఖం: ప్రణబ్ ముఖర్జీ
ప్రజా సంక్షేమం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలసి పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. ఈ మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాసిన 'ఉనికి' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ తెలంగాణకు రాజధాని మాత్రమే కాదని, దేశంలోని ఓ ముఖ్యపట్టణమని ఆయన అభివర్ణించారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఎవరినీ వదులుకోకూడదని, కలసి వుంటే మరింత వేగంగా అభివృద్ధి చెందవచ్చని పిలుపునిచ్చారు. "ఉనికి పుస్తకావిష్కరణలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యాసాగర్ రావు చాలా మంచి వ్యక్తి. హైదరాబాద్ ఓ గొప్ప నగరం, దేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతం. మతసామరస్యానికి ప్రతీక. ఈ నగరం అంటే దేశ ప్రజలందరికీ ఎంతో ఇష్టం. నాకు కూడా. అన్ని రంగాల్లో హైదరాబాదు అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఐటీ, విద్యారంగానికి హబ్ గా నిలిచింది. నగరానికున్న ప్రాముఖ్యత, స్నేహపూర్వక వాతావరణం చెడకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే" అని ఆయన అన్నారు.